Bylaws

 

BYLAWS :

I సంస్థ

1. సంస్థపేరు : సంఘము పేరు తెలుగులో ''తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌'' (టిఎస్‌యుటియఫ్‌) ఇంగ్లీషులో ''Telangana State United Teachers' Federation (TSUTF)"
2. రిజిస్ట్రేషన్‌ నెం: 288/2014, హైదరాబాద్‌.
3. జెండా : పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండు ఎరుపు జెండాపైన TSUTF అను ఆంగ్ల అక్షరములు తెలుపు రంగులో నుండును.
4.చిహ్నము : లోపలి వృత్తములో ఉదయించుచున్న సూర్యుడు, TSUTF పతాకము, వెలుపలి వృత్తములో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ అని తెలుగులోను, Telangana State United Teachers' Federation అని ఆంగ్లములోను ఉండును
5. రాష్ట్ర సంఘ కార్యాలయం : ఇంటి నెంబరు 1-2-288/8, చెన్నుపాటి భవన్‌, గగన్‌మహాల్‌ రోడ్‌ నం.7, దోమలగూడ, హైదరాబాదు - 29.
6. అనుబంధం : ఈ సంఘం భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (STFI)కి అనుబంధ సంస్థగా వుంటుంది.

II ఆశయాలు :

1. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల, అన్ని తరగతుల ఉపాధ్యాయులలో ఐకమత్యం, సంఘీభావం, సౌభ్రాతృత్వము, సహకార భావమును పెంపొందించుట.
2. వివిధ మేనేజిమెంట్లలోని పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యాయులందరితో ఐక్య ఉద్యమ నిర్మాణానికి కృషి చేయుట.
3. అన్ని యాజమాన్యాలలోని ఉపాధ్యాయులను అన్ని విషయములలో సమానముగా పరిగణించుటకు కృషి చేయుట.
4. ఏజన్సీ మున్నగు వెనకబడిన ప్రాంతాల ఉపాధ్యాయులకు ప్రత్యేక రాయితీలకొరకు, మహిళా టీచర్ల ప్రత్యేక సమస్యల పరిష్కారానికి కృషి చేయుట.
5. ఉపాధ్యాయుల సాంఘిక, ఆర్థిక, వైజ్ఞానిక అభివృద్ధికి, సామూహిక మరియు వ్యక్తిగత సమస్యల పరిష్కారమునకు పనిచేయుట.
6. ఉపాధ్యాయుల హక్కుల రక్షణకు, బాధ్యతల నిర్వహణకు, వృత్తి నైపుణ్యం, పని సంస్కృతిని పెంపొందించుటకు పాటు పడుట.
7. ''అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ'' నిరంతర కర్తవ్యాలుగా కృషి చేయుట.
8. విద్యాహక్కు చట్టం అమలుకు, నాణ్యమైన, సమానమైన విద్యాబోధనకు మరియు విద్యారంగ పూర్తి బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వహించేలా కృషి చేయుట.
9. ప్రభుత్వ విద్యారంగం విస్తరణకు, పరిరక్షణకు కృషి చేయుట.
10. విద్యా ప్రణాళికలు, పాఠ్య గ్రంథాలు రూపొందించుటలో, విద్య పాలనా నిర్వహణలో ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం కొరకు కృషి చేయుట.
11. సెక్యులర్‌ విలువలు, శాస్త్రీయ ఆలోచన, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, శ్రామికవర్గ సమైక్యత పెంపొందించుటకు కృషి చేయుట.
12. అన్ని స్థాయిలలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించుట.

III ఆశయ సాధనకు మార్గాలు :

1. సంఘ ఆశయాల సాధనకు అనుగుణంగా సభలు, సమావేశములు, గోష్ఠులు, అధ్యయన వేదికలు, విజ్ఞాపనలు, రాయబారాలు, ప్రదర్శనలు, ధర్నాలు తదితర కార్యక్రమాల ద్వారా కృషి చేయుట.
2. విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి స్వంత కార్యాచరణను మరియు సోదర సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్మించుట.
3. జాతీయ స్థాయిలో ఎస్‌టిఎఫ్‌ఐతోను, అంతర్జాతీయ ఉపాధ్యాయ ఉద్యమాలతోను అనుబంధం కల్గియుండి, అవి యిచ్చే కార్యక్రమాలను అమలు చేయుట.
4. సంఘ అధికార వాణిగా ''వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌'' మాసపత్రికను నడుపుట.
5. సంఘ సమాచారం కార్యకర్తలకు తెలియజేయుటకు ఒక బులిటెన్‌ను రాష్ట్ర, జిల్లాల స్థాయిలో నడుపుట.
6. కరపత్రాలు, పుస్తక ప్రచురణలు, వార్తాపత్రికల ద్వారా ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ సమస్యలపైన ప్రచారం గావించి ప్రజల సహకారం, మద్దతు పొందుట.
7. విద్యా విషయక విభాగం ద్వారా విద్యా విషయక పత్రాలు రూపొందించి వర్క్‌షాప్‌లు, శిక్షణా తరగతులు నిర్వహించుట ద్వారా ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యం పెంచుట.
8. శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్‌ సభ్యుల సహకారముతో చట్ట సభల్లో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయుట.
9. సంఘం నిర్ణయించిన అభ్యర్థులను లేదా బలపరచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా శాసన మండలిలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేయుట.
10. రాష్ట్రంలోని యితర ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో ఏర్పడు ఐక్య ఉద్యమ వేదికల్లో భాగస్వామిగా వుండి అన్ని విధాలా సమస్యల పరిష్కారానికి కృషి చేయుట.

IV సభ్యత్వము :

1. సభ్యుని అర్హత : సంఘ ఆశయములను అంగీకరించి నిర్ణయించిన సభ్యత్వ రుసుమును చెల్లించు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యముల పాఠశాలల ఉపాధ్యాయులు టిఎస్‌యుటియఫ్‌లో సభ్యులుగా చేరుటకు అర్హులు.
2. సభ్యత్వ కాలము : విద్యా సంవత్సరము (జూన్‌ నుండి మే వరకు) సభ్యత్వ సంవత్సరంగా పరిగణించబడును. సభ్యత్వము చేర్చు గడువు ప్రతి సంవత్సరం జూన్‌ నుండి అగస్ట్‌ వరకూ ఉంటుంది. ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు క్యాంపెయిన్‌ గడువును నెల రోజులకు మించకుండా పొడిగించే అధికారం రాష్ట్ర కార్యవర్గానికి ఉంటుంది.
3. సభ్యత్వ రుసుము : సభ్యత్వ రుసుము సం||కు 100/- (వంద రూపాయలు)
4. సభ్యత్వ వాటాలు : మండల / పట్టణ శాఖకు 40/- జిల్లా శాఖకు 40/-, రాష్ట్ర సంఘమునకు 20/-, మండల పట్టణ శాఖలు లేని చోట అవి ఏర్పడు వరకూ ఆయా శాఖల వాటా కూడ జిల్లా శాఖకు చెందుతుంది.
5. జనరల్‌ ఫండ్‌ : సంఘ అవసరాల నిమిత్తం సభ్యులు, సానుభూతిపరుల నుండి జనరల్‌ ఫండ్‌ వసూలు చేయాలి. వసూలైన మొత్తంలో మండల / పట్టణ శాఖకు 50%, జిల్లా శాఖకు 35%, రాష్ట్ర సంఘమునకు 15% చెందుతుంది.
6. ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర సంఘ అనుమతితో భవననిధి, విద్యాగోష్టులు, మహాసభల నిమిత్తం వసూలు చేసే నిధులు, ఇతర విరాళములు జనరల్‌ ఫండ్‌గా పరిగణించబడవు.
7. సభ్యుని హక్కులు - బాధ్యతలు :
ఎ. ప్రతి సభ్యునికి ఆయా స్థాయిలలో నాయకత్వ స్థానాలకు ఎన్నుకొనుటకు, ఎన్నుకోబడుటకు హక్కు ఉంటుంది.
బి. సభ్యులు ఆయా స్థాయి శాఖ సమావేశాలకు హాజరై చర్చలలో పాల్గొనుటకు, నిర్ణయాల్లో భాగస్వాములు అగుటకు, భిన్నాభిప్రాయాన్ని తెలుపుటకు హక్కు కల్గి ఉంటారు.
అన్ని స్థాయిల్లోని బాధ్యులు ముందుగా సంబంధిత ప్రధానకార్యదర్శి అనుమతి పొందకుండా వరుసగా రెండు సమావేశాలకు హాజరు కానప్పుడు వారి పదవిని కోల్పోతారు. అట్టి సమాచారం సంబంధిత బాధ్యునికి ప్రధానకార్యదర్శి తెలియజేయాలి.
సి. శాఖలు, కమిటీలు చేసిన నిర్ణయాలను అమలు పరుస్తూ తనకు సమ్మతం కానప్పుడు ఆయా సమావేశాలలో విమర్శ పెట్టే హక్కు కలిగి ఉంటారు. అయితే బహిరంగంగా విమర్శలు చేయరాదు.
డి. సభ్యులు చేసిన విమర్శలపై ఆ శాఖ, కమిటీలో చర్చించి, చేసిన తుది నిర్ణయాన్ని ఆ సభ్యులు తప్పక అమలు చేయాలి.
ఇ. సంఘంలో బాధ్యతలను సంఘేతర పనులకు వినియోగించరాదు.
8. క్రమ శిక్షణా చర్యలు:
తెలియజేయాలి ఎ. సంఘ నిబంధనావళికి, క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిపైన, శాఖపైన క్రమ శిక్షణా చర్యలు తీసుకొనబడును. క్రమ శిక్షణ ఉల్లంఘించిన వారికి ఛార్జిషీటు పంపి,15 రోజుల లోపల సంజాయిషీ ఇచ్చుకొనే అవకాశం ఉంటుంది.
బి. సంఘం సొమ్మును దుర్వినియోగపరచినప్పుడు వారిపై చట్టపరంగా క్రిమినల్‌ చర్యలు తీసుకునే అధికారం పై శాఖకు ఉంటుంది.
సి. ఏ స్థాయిలోనైనా క్రమ శిక్షణా చర్య తీసుకొనే అధికారం ఆయా స్థాయి కార్యవర్గాలకు మాత్రమే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో క్రమశిక్షణా చర్య తీసుకొనే అధికారం ఆఫీస్‌ బేరర్స్‌కి వుంటుంది. అయితే సదరు నిర్ణయం సంబంధిత కార్యవర్గం ఆమోదానికి లోబడి వుంటుంది.
డి. క్రమ శిక్షణా చర్యకు గురియైన వారు 30 రోజుల లోపు పై శాఖ ప్రధాన కార్యదర్శికి అప్పీలు చేసుకోవచ్చును. అప్పీలుపై తాత్కాలిక స్టే యిచ్చే అధికారం మాత్రమే పై శాఖ ఆఫీసు బేరర్లకు ఉంటుంది. తుది నిర్ణయం చేసే అధికారం పై శాఖ కార్యవర్గానికే ఉంటుంది. 30 రోజులలోగా అప్పీలు పరిష్కారం చేయబడుతుంది.
9. రాజీనామా - ఆమోదం :
ఎ. ఎవరైనా ప్రాథమిక సభ్యత్వానికిగాని, శాఖలలోని బాధ్యతలకు గాని రాజీనామా చేస్తే తమ రాజీనామా లేఖను సంబంధిత శాఖ ప్రధానకార్యదర్శికి పంపించాలి. ప్రధానకార్యదర్శి రాజీనామా చేస్తే తన రాజీనామా లేఖను ఆ శాఖ అధ్యక్షునికి పంపించాలి. అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఇరువురు రాజీనామా చేసిన సందర్భంలో వారి రాజీనామా లేఖలను పై శాఖ ప్రధానకార్యదర్శికి పంపించాలి.
బి. ప్రాథమిక సభ్యుల రాజీనామాలను మండల శాఖ ఆఫీస్‌ బేరర్లు, మండల/పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయి బాధ్యతలలో ఉన్నవారి రాజీనామాలను సంబంధిత శాఖల కార్యవర్గాలు చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాయి.

V నిర్మాణం

1. సంఘానికి రాష్ట్ర, జిల్లా, మండల / పట్టణ స్థాయిలో కార్యవర్గము మరియు ఆఫీసు బేరర్లు అను రెండు పాలక వర్గములు ఉంటాయి.
2. మండల / పట్టణ శాఖ :
(I) సభ్యులు కనీసం 20 మంది ఉన్నప్పుడు మాత్రమే మండల / పట్టణ శాఖ ఏర్పడును. అంతకు తక్కువ ఉన్నప్పుడు జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ ఆ మండలం / పట్టణానికి ముగ్గురితో కన్వీనింగ్‌ కమిటీని నియమిస్తారు.
(II) మండల / పట్టణ మహాసభ : ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదు అనంతరం సెప్టెంబర్‌ 1 నుండి అక్టోబర్‌ 15లోపు ఒకరోజు మండల / పట్టణ మహాసభ జరపాలి.
ఎ. మండల / పట్టణంలోని ప్రాథమిక సభ్యులందరూ మహాసభ ప్రతినిధులుగా ఉంటారు.
బి. మండల / పట్టణ మహాసభ మండల / పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకొంటుంది. 40లోపు సభ్యత్యానికి 15మంది, 41 నుండి 60 వరకు 20మంది 61 నుండి 100 వరకు 30మంది, 101 నుండి ఆపైన ప్రతి 10మంది సభ్యులకు ఒక్కరు చొప్పున కార్యవర్గ సభ్యులు ఉంటారు. వారిలో 25% తగ్గకుండా మహిళలు ఉంటారు.
సి. మండల / పట్టణ కార్యవర్గం మండల / పట్టణ ఆఫీసు బేరర్లను, ఆడిటర్‌ను ఎన్నుకొంటుంది. అకడమిక్‌, మహిళ, సాంస్కృతిక, క్రీడా విభాగాలకు బాధ్యులను నియమిస్తుంది. వీరి పదవీ కాలం ఒక సంవత్సరం.
డి. మండల ఆఫీసు బేరర్ల సంఖ్య 40లోపు సభ్యత్వానికి 7, 41 నుండి 100 వరకు 9,101 నుండి 150 వరకు 11, 151 నుండి 200 వరకు 13, 201 నుండి 300 వరకు 15, ఆపైన ప్రతి 100 సభ్యత్వానికి ఒకరు చొప్పున 20 మందికి మించకుండ ఉంటారు.
ఇ. 40లోపు సభ్యత్వానికి కనీసం ఒక్కరు, ఆపైన సభ్యత్వంగల శాఖల ఆఫీస్‌ బేరర్లలో ఇద్దరికి తగ్గకుండా మహిళలు ఉంటారు.
ఎఫ్‌. మండల ఆఫీసు బేరర్లలో ఒక అధ్యక్షుడు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు ఉపాధ్యక్షులు (వారిలో ఒకరు మహిళ), ఒక కోశాధికారి మిగిలిన వారు కార్యదర్శులుగా ఉంటారు.
జి. మండల / పట్టణ శాఖకు ఒక ఆడిటర్‌ వుంటారు. వీరు మండల / పట్టణ ఆఫీస్‌ బేరర్ల సమావేశానికి ఆహ్వానితులుగా ఉంటారు.
హెచ్‌.జిల్లా మహాసభ జరిగే సంవత్సరంలో జిల్లా కార్యవర్గం నిర్ణయించిన సంఖ్యమేరకు జిల్లా మహాసభకు ప్రతినిధులను మండల / పట్టణ మహాసభలో ఎన్నుకొందురు. వీరిలో ప్రతి నలుగురిలో కనీసం ఒక మహిళ ఉంటారు.
3. జిల్లా శాఖ :
(I) జిల్లాలోని నిర్మాణం గల మండల / పట్టణ శాఖలతో ఏర్పడుతుంది.
(II) జిల్లా మహాసభ : ప్రతి రెండవ సంవత్సరం మండల / పట్టణ మహాసభల అనంతరం నవంబర్‌ 30లోపు 2 రోజులు జిల్లా మహాసభ నిర్వహించాలి.
ఎ. మండల / పట్టణ శాఖల నుండి ఎన్నికైన ప్రతినిధులు, మహాసభనాటికి గల జిల్లా ఆఫీసు బేరర్లు, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు, జిల్లా కేంద్ర బాధ్యతలలో ఉండేవారు మరియు ఆ జిల్లాకి చెందిన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్‌లు జిల్లా మహాసభ ప్రతినిధులవుతారు. మండల / పట్టణ శాఖ లేని చోట జిల్లా ఆఫీస్‌బేరర్స్‌ నియమించిన కన్వీనరు మహాసభ ప్రతినిధి అవుతారు.
బి. మొత్తం ప్రతినిధుల సంఖ్య 100కి తగ్గకుండా 500కు మించకుండా వుండాలి.
సి. మండల / పట్టణ శాఖల నుండి ఎన్నిక కావలసిన ప్రతినిధుల సంఖ్యను జిల్లా కార్యవర్గం నిర్ణయిస్తుంది. ప్రతినిధులలో 25%కు తగ్గకుండా మహిళలు ఉంటారు.
డి. జిల్లా మహాసభ జిల్లా కార్యవర్గ సభ్యుల సంఖ్యను నిర్ణయించి ఆ మేరకు జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకొంటుంది. కార్యవర్గ సభ్యుల సంఖ్య జిల్లా ఆఫీసు బేరర్లు, ఆడిట్‌ కమిటీ సభ్యులు, మండల / పట్టణ శాఖల ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, జిల్లా కేంద్ర బాధ్యతలలో ఉన్నవారు మరియు మహిళలతో సహా 60 మందికి తగ్గకుండా 150కి మించకుండా వుంటుంది. జిల్లా కార్యవర్గ సభ్యులలో 25%కు తగ్గకుండా మహిళలు ఉంటారు.
ఇ. జిల్లా కార్యవర్గం జిల్లా ఆఫీసు బేరర్లను, జిల్లా ఆడిట్‌ కమిటీని ఎన్నుకొంటుంది. అకడమిక్‌, మహిళ, సాంస్కృతిక, సోషల్‌ మీడియా, క్రీడా విభాగాలను జిల్లా బులెటిన్‌ సంపాదక వర్గాన్ని నియమిస్తుంది. వీరి పదవీ కాలం రెండు సంవత్సరములు.
ఎఫ్‌. జిల్లా ఆఫీసు బేరర్ల సంఖ్య : 3000 సభ్యత్వం వరకూ 15 మంది, ఆపైన ప్రతి 500 సభ్యత్వానికి ఒకరు చొప్పున అవసరాన్నిబట్టి 25 మందికి మించకుండా ఉంటుంది. 5 వేలలోపు సభ్యత్వం వుంటే ఇద్దరికి తగ్గకుండా, 5వేలపైన సభ్యత్వం వుంటే ముగ్గురికి తగ్గకుండాను మహిళలు ఉండాలి. జిల్లా ఆఫీసు బేరర్లలో ఒక అధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు ఉపాధ్యక్షులు (వారిలో ఒకరు మహిళ), ఒక కోశాధికారి మిగిలిన వారు కార్యదర్శులుగా ఉంటారు.
జి. జిల్లా ఆడిట్‌ కమిటీ సంఖ్య 7కి మించకుండా ఉంటుంది. వారిలో ఒకరు కన్వీనరు. మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు.
హెచ్‌. రాష్ట్ర మహాసభ ప్రతినిధులను రాష్ట్ర కార్యవర్గం కేటాయించిన సంఖ్య మేరకు జిల్లా మహాసభలో ఎన్నుకొంటారు. వీరిలో 25%కు తగ్గకుండా మహిళలు ఉండాలి.
4.రాష్ట్ర మహాసభ : ప్రతి రెండవ సంవత్సరం డిసెంబర్‌ నెలలో 2 రోజులకు తగ్గకుండా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన చోట రాష్ట్ర మహాసభ జరపాలి.
ఎ. జిల్లా శాఖల నుండి ఎన్నుకోబడిన ప్రతినిధులు, మహాసభనాటికి గల రాష్ట్ర ఆఫీసు బేరర్లు, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు రాష్ట్ర కేంద్ర బాధ్యతలలో వుండేవారితో సహా మొత్తం 300కు మించకుండా రాష్ట్ర మహాసభ ప్రతినిధులుగా ఉంటారు. జిల్లా శాఖల నుండి ఎన్నిక కావలసిన ప్రతినిధుల సంఖ్యను రాష్ట్ర కార్యవర్గం నిర్ణయిస్తుంది. ప్రతినిధులలో 25%కి తగ్గకుండా మహిళలు ఉండాలి.
బి. రాష్ట్ర మహాసభ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకొంటుంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సంఖ్య 75కు మించకుండా ఉండాలి. వారిలో 25%నకు తగ్గకుండా మహిళలు ఉండాలి.
సి. రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ఆఫీసు బేరర్లు, ఆడిట్‌ కమిటీ సభ్యులు, జిల్లా శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కేంద్రం బాధ్యతలలో ఉండే వారి సంఖ్యపోగా మహాసభ నిర్ణయించిన మేరకు అదనపు సభ్యులను ఆ సంవత్సరపు సభ్యత్వ దామాషాలో ఆయా జిల్లాల ప్రతినిధుల నుండి ఎన్నుకొంటారు.
డి. రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర ఆఫీసు బేరర్లను, రాష్ట్ర ఆడిట్‌ కమిటీని ఎన్నుకుంటుంది. పత్రిక సంపాదక వర్గాన్ని నియమిస్తుంది. అకడమిక్‌, ప్రచురణలు, మహిళ, సాంస్కృతిక, సోషల్‌ మీడియా, క్రీడా విభాగాలకు కమిటీలను నియమిస్తుంది. వీరి పదవీ కాలం రెండు సంవత్సరములు.
ఇ. రాష్ట్ర ఆఫీసు బేరర్ల సంఖ్య :- రాష్ట్ర ఆఫీసు బేరర్ల సంఖ్య 13 కి మించకుండా ఉంటుంది. వీరిలో కనీసం ఇద్దరు మహిళలు ఉంటారు. ఆఫీసు బేరర్లలో ఒక అధ్యక్షులు, ఒక ప్రధానకార్యదర్శి, ఇద్దరు ఉపాధ్యక్షులు (వారిలో ఒకరు మహిళ), ఒక కోశాధికారి మరియు మిగిలిన వారు కార్యదర్శులుగా ఉంటారు.
ఎఫ్‌. రాష్ట్ర ఆడిట్‌ కమిటీ ముగ్గురికి మించకుండా ఉంటుంది. వారిలో ఒకరు కన్వీనరు. మిగిలిన వారు సభ్యులు.
జి. పత్రిక సంపాదక వర్గము, అకడమిక్‌, ప్రచురణలు, మహిళ, సాంస్కృతిక, సోషల్‌ మీడియా, క్రీడా విభాగాల కమిటీల సభ్యుల సంఖ్యను, వారి హోదాలను రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించి నియమిస్తుంది.
హెచ్‌. పత్రిక ప్రధాన సంపాదకుడు, అకడమిక్‌, ప్రచురణలు, మహిళ, సాంస్కృతిక, క్రీడా,సోషల్‌ మీడియా విభాగాల కన్వీనర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులై ఉండాలి.
ఐ. ఎస్‌టిఎఫ్‌ఐ మహాసభ ప్రతినిధులు, కౌన్సిల్‌ సభ్యులను రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకుంటుంది.
5. ఎన్నిక విధానం :
1. అన్ని స్థాయిల్లోనూ మహాసభ ప్రతినిధుల నుండి అప్పటివరకూ పనిచేసిన ఆఫీసు బేరర్లు తమకున్న ఉద్యమ నిర్మాణ అవగాహన ఆధారంగా కార్యవర్గం ప్యానల్‌ని ప్రతిపాదిస్తారు. ప్రతినిధులు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయుటకు, ఎన్నుకొనుటకు, ఎన్నికగుటకు అర్హత కలిగి ఉంటారు. కార్యవర్గ సభ్యులుగా ప్రతిపాదించేవారు ఆ మహాసభ ప్రతినిధి అయి ఉండాలి. మొత్తం ప్యానల్‌కు గాని, కొన్ని స్థానములకుగాని ఎన్నిక అనివార్యం అయితే తగిన సమయం తీసుకొని రహస్య బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహించాలి.
2. అన్ని స్థాయిల్లో ఆఫీసు బేరర్లు, ఆడిట్‌ కమిటీలకు జరుగు ఎన్నికకు అప్పటివరకు పనిచేసిన ఆఫీసు బేరర్లు తమ ఉద్యమ నిర్మాణ అవగాహన ఆధారంగా ప్యానల్‌ను ప్రతిపాదించును. మహాసభలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయుటకు అర్హత కలిగి ఉంటారు. మొత్తం స్థానాలకు గాని, కొన్ని స్థానాలకు గాని ఎన్నిక అనివార్యమయితే తగిన సమయం తీసుకొని రహస్య బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహించాలి.
3. క్రింది శాఖల ఎన్నికల అధికారిని పై శాఖ ఆఫీసు బేరర్లు నిర్ణయిస్తారు. రాష్ట్ర సంఘం ఎన్నికల నిర్వహణకు ఉద్యమ అవగాహన, నిర్మాణం విషయంలో మంచి అనుభవం ఉన్నవారిని రాష్ట్ర కార్యవర్గం తగినంత ముందుగా నియమిస్తుంది.
4. మండల / పట్టణ, జిల్లా, రాష్ట్ర కార్యవర్గాలకు ఎన్నికయ్యే సభ్యులందరూ విధిగా సంఘపత్రిక ''వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌'' చందాదారులై ఉండాలి.
5. ప్రతిజ్ఞ :- ఎన్నికైన వారిచేత ఈ క్రింది విధంగా ప్రతిజ్ఞ చేయించాలి.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడురేషన్‌ (TSUTF) .........గా ఎన్నికైన,...... (పేరు) అను నేను ''తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నిబంధనలకు, పాలసీకి కట్టుబడివుండి, అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తూ సదా ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యాభివృద్ధికి కృషి చేస్తూ త్యాగబుద్ధితో నడుచుకొనగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను''.

VI విధులు

1. అధ్యక్షుడు : ఎ) ఆఫీస్‌ బేరర్స్‌, కార్యవర్గం సమావేశాలకు అధ్యక్షత వహించును. కార్యక్రమాల అమలుకు నాయకత్వం వహించును. బి) అత్యవసర పరిస్థితులలో ఆఫీస్‌ బేరర్స్‌, కార్యవర్గం సమావేశాలను ఏర్పాటు చేయమని ప్రధాన కార్యదర్శిని కోరును. అలా కోరిన 15 రోజుల లోపల సదరు సమావేశాలను ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేయకపోతే, తానే స్వయంగా సమావేశాలను పిలువ వచ్చును.
సి) సంఘ కార్యక్రమాల ఖర్చులకుగాను సంఘ నిధి నుండి రాష్ట్ర అధ్యక్షుడు రు. 2,000/- జిల్లా అధ్యక్షుడు రు. 1000/-, మండల అధ్యక్షుడు రు. 500/- వరకు తన వద్ద నిల్వ వుంచుకొనవచ్చును.
2.ప్రధాన కార్యదర్శి :
ఎ) సంఘ కార్యక్రమాల అమలుకు, ఆఫీస్‌ నిర్వహణకు బాధ్యత వహించును.
బి) ఆఫీస్‌ బేరర్స్‌, కార్యవర్గం సమావేశాలను ఏర్పాటు చేయును. విస్తృత కార్యవర్గం, మహాసభలను ఆఫీస్‌ బేరర్ల సహకారంతో నిర్వహించుటకు బాధ్యత వహిస్తారు.
సి) సమావేశాల మినిట్స్‌, సంఘం నివేదికలు, ఆస్థుల డాక్యుమెంట్లు మున్నగు వాటిని భద్ర పరచును.
డి) సంఘం ఖర్చులకుగాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రు. 3000/- జిల్లా ప్రధాన కార్యదర్శి రు. 2000/-, మండల ప్రధానకార్యదర్శి రు. 1000/-లు వరకు తన వుంచుకొనవచ్చును.
ఇ) సంఘం ఖర్చుల చెల్లింపులకు మరియు అవసరమైనప్పుడు ఆఫీస్‌ బేరర్ల నిర్ణయం మేరకు అప్పులు తెచ్చుటకు బాధ్యత వహించును.
3. ఉపాధ్యక్షులు : అధ్యక్షుడు తన విధులను నిర్వహించుటకు అవకాశము లేనప్పుడు సదరు అధ్యక్షుని బాధ్యతలను ఆఫీస్‌ బేరర్ల నిర్ణయం మేరకు ఉపాధ్యక్షులలో ఒకరు నిర్వహిస్తారు మరియు సంఘం అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తారు.
4. కోశాధికారి : సంఘం జమాఖర్చులకు బాధ్యత వహించును. ప్రధానకార్యదర్శి అనుమతి మేరకు చెల్లింపులు చేయును. మండల స్థాయిలో 3 నెలలకి ఒకసారి, రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 నెలలకి ఒకసారి, ఆడిట్‌ చేయబడిన జమా ఖర్చుల వివరాలను కార్యవర్గ సమావేశానికి సమర్పించును. ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో నివేదిక ఇవ్వాలి. సంఘం రోజువారి ఖర్చులకుగాను రాష్ట్ర కోశాధికారి - 5000/-, జిల్లా కోశాధికారి - 3000/-, మండల కోశాధికారి -1000/- తన వద్ద వుంచుకొనవచ్చును. సంఘం అప్పగించిన ఇతర బాధ్యతలను నిర్వహించాలి.
5. కార్యదర్శులు : ప్రధానకార్యదర్శి విధులకు సహకరిస్తారు. సంఘం అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రధాన కార్యదర్శి విధులు నిర్వహించలేని పరిస్థితులలో ఆఫీస్‌ బేరర్స్‌చే అధికారం యివ్వబడిన ఒక కార్యదర్శి ప్రధానకార్యదర్శి విధులు నిర్వహిస్తారు.
6. కార్యవర్గ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో సంఘ కార్యక్రమాల అమలుకు బాధ్యత వహిస్తారు.

VII అనుబంధ సంఘాలు

ఎ) వివిధ సెక్షన్‌ల ఉపాధ్యాయుల కోసం పనిచేస్తున్న భావసారూప్య సంఘాలను TSUTF కి అనుబంధ సంఘాలుగా అనుమతించబడును.
బి) TSUTF రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు ఆయా సంఘాలు ప్రతి సంవత్సరం అనుబంధ రుసుమును చెల్లించాలి.
సి) అనుబంధ సంఘాల సమావేశాలు, ప్రాతినిధ్యాలు, ఆందోళనలు,పోరాటాలు తదితర కార్యక్రమాలకు TSUTF మద్దతుగా వుంటుంది. సదరు ఉపాధ్యాయుల సంక్షేమానికి, సంఘ చైతన్యానికి TSUTF తోడ్పడుతుంది.
డి) అనుబంధ సంఘాల బాధ్యులు TSUTF సభలు, సమావేశాలకు ప్రతినిధులుగా, ఆహ్వానితులుగా TSUTF ఆఫీస్‌ బేరర్స్‌ నిర్ణయించిన సంఖ్య మేరకు అనుమతించబడతారు.

VIII శాసన సభా రంగం

ఎ) శాసనమండలిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యారంగాభివృద్ధికి, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమానికి పనిచేసే అభ్యుదయ వాదులైన అభ్యర్థులను TSUTF బలపరుస్తుంది. గెలిపించటానికి కృషి చేస్తుంది.
బి) TSUTF ఇతర అభ్యుదయ సంఘాలు, సంస్థల కృషితో గెలిచిన ఎమ్మెల్సీల తోడ్పాటుతో శాసనసభా రంగం ద్వారా విద్యారంగాభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి TSUTF కృషి చేస్తుంది.
సి)TSUTF, ఇతర అభ్యుదయ సంఘాలు, సంస్థల కృషితో ఎన్నికైన శాసనమండలి సభ్యులలో TSUTF సభ్యత్వం కలిగిన వారి నుండి రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల నిర్ణయం ప్రకారం ఒకరు రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాలకు, మిగిలిన వారందరూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఆహ్వానితులుగా వుంటారు.

IX పత్రిక

1. తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ అధికారవాణిగా ''వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌'' మాసపత్రిక ఉంటుంది.
2. ఇందులోని రచనలు సంఘం పాలసీని, నిబంధనలను, విధానాలను అనుసరించి ఉంటాయి.
3. సంఘం ఆశయాలు, విధానాలు, కార్యక్రమాలకు అనుగుణంగా పత్రిక నడిపించుటకు సంపాదక వర్గం బాధ్యత వహిస్తుంది.
4. TSUTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సంపాదక వర్గమునందు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారు.
5. ప్రధాన సంపాదకులు కనీసం మూడు నెలలకి ఒకసారి సంపాదకవర్గ సమావేశము ఏర్పాటు చేయును.
6. రాష్ట్ర ఆఫీస్‌ బేరరు కానివారు పత్రిక ప్రధాన సంపాదకులుగా నియమించబడిన సందర్భంలో రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
7. పత్రిక నిర్వహణ బాధ్యతను ప్రధాన సంపాదకులు, ఆర్థిక విషయాలను రాష్ట్ర ప్రధానకార్యదర్శి నిర్వహిస్తారు.
8. మూడు నెలలకు ఒకసారి పత్రిక అకౌంట్స్‌ను రాష్ట్ర ఆడిట్‌ కమిటీ ఆడిట్‌ చేస్తుంది.
9. ఆడిట్‌ చేయబడిన జమాఖర్చుల వివరాలను రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమర్పించును.

X అకౌంట్స్‌ నిర్వహణ

1. అన్ని స్థాయిల TSUTF శాఖల జమా ఖర్చులకు సంబంధించి రోజువారీ అకౌంట్స్‌, లెడ్జర్‌, ఓచర్‌ ఫైల్స్‌, రశీదు పుస్తకములను రెగ్యులర్‌గా నిర్వహించాలి. సంఘానికి సంబంధించిన డబ్బు జాతీయ బ్యాంక్‌ల ఎకౌంట్లలోనే భద్రపరచాలి.
2. రాష్ట్ర సంఘం ఎకౌంట్స్‌ చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ ద్వారా సంవత్సరానికి ఒకసారి ఆడిట్‌ చేయించాలి.
3. రాష్ట్ర కేంద్రంలో సంఘం, పత్రిక, ప్రచురణలకు విడిగా ఎకౌంట్స్‌ నిర్వహించాలి. సంఘం డబ్బుని ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారి, పత్రిక డబ్బు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర అధ్యక్షులు, ప్రచురణల డబ్బుని అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి / ప్రచురణ కమిటీ కన్వీనర్‌ జాయింట్‌ ఎకౌంట్స్‌తో నిర్వహించాలి. జిల్లా, మండల శాఖలు సంఘం డబ్బుని ప్రధానకార్యదర్శి మరియు కోశాధికారి జాయింట్‌ ఎకౌంట్స్‌లో నిర్వహించాలి.
4. మహాసభలు, సదస్సులు, భవన నిర్మాణాల ఎకౌంట్స్‌ నిర్వహణకు ఆయా స్థాయిల్లోని కార్యవర్గం అవసరమైన నిర్ణయాలు చేసి బాధ్యతలు అప్పగించును.
5. ఆడిట్‌ చేయబడిన జమా ఖర్చులను కార్యవర్గం చర్చించి ఆమోదిస్తుంది.
6. ఆస్తులు : తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ యొక్కగాని దాని అన్ని స్థాయిలలోని క్రింది శాఖల యొక్క స్థిర చరాస్థులన్నియు తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీకి చెందుతాయి. ఆయా ఆస్తులపై వచ్చు రాబడి, వాటిపై చేయు ఖర్చులకు ఆయా శాఖలే బాధ్యత వహించును. ఏ పరిస్థితులలోను రాష్ట్ర సంఘం అనుమతిలేకుండా చేసిన అప్పులకు రాష్ట్ర సంఘం బాధ్యత వహించదు. ఆయా శాఖలకు చెందిన స్థిర, చరాస్తులను రాష్ట్ర సంఘం అనుమతి లేనిదే ఎవ్వరు కూడా మార్పిడి చేయుటకుగాని, అనుభవించుటకు గాని వీలులేదు. ఆస్తులు రిజిష్టరు చేయించుకొన్నప్పుడు ఆయా శాఖలు రాష్ట్ర సంఘ అనుబంధ శాఖల ఆస్తులుగానే రిజిష్టరు చేయించుకోవాలి.

XI ఆడిట్‌ కమిటీ

1. రాష్ట్ర ఆడిట్‌ కమిటీ ముగ్గురుతోను, జిల్లాల ఆడిట్‌ కమిటీలు ఏడుగురికి మించకుండా వుండును. మండల / పట్టణ శాఖలకు ఒక ఆడిటర్‌ ఉంటారు.
2. ఆడిట్‌ కమిటీ కన్వీనరు / ఆడిటరు ఆయా స్థాయిల ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు.
3. ఆడిట్‌ కమిటీ / ఆడిటర్‌ తమ పరిధిలోని సంఘం, శాఖల ఆర్థిక క్రమ శిక్షణను పరిరక్షించేందుకు కృషి చేయాలి.
4. రాష్ట్ర స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సంఘం, పత్రిక అకౌంట్స్‌ను ఆడిట్‌ చేస్తుంది.
5. అకౌంట్స్‌ సక్రమ నిర్వహణకు అవసరమైన గైడెన్స్‌ యిస్తూ కోశాధికారుల విధి నిర్వహణకు తోడ్పడతారు.
6. ప్రతి శాఖ తమ జమా ఖర్చులను స్థానిక ఆడిట్‌ కమిటీచే 3 నెలల కొకసారి ఆడిట్‌ చేయించి, సదరు ఆడిట్‌ రిపోర్ట్‌ని పై శాఖకు పంపించాలి.
7. ఆయా శాఖల ఆడిట్‌ కమిటీలు ఆడిట్‌ చేసిన జమాఖర్చులను పై కమిటీకి చెందిన ఆడిట్‌ కమిటీ సంవత్సరానికి ఒకసారి తిరిగి ఆడిట్‌ చేసి అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా ఇచ్చి అవసరమైన సూచనలు చేస్తుంది. ఆడిట్‌ చేయుటకు 15 రోజులు ముందు ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ నోటీస్‌ యిచ్చును.
8. ఆడిట్‌ కమిటీలు చేసిన రిమార్క్‌లు, సూచనలను ఎప్పటికప్పుడు ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాల్లో చర్చించి అవసరమైన దిద్దుబాట్లు చేసుకొనాలి.

XII సాధారణ నిబంధనలు

1. సమావేశములు : అన్ని శాఖల కార్యవర్గ సమావేశాలు కనీసం 3 నెలలకు ఒకసారి మరియు ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాలు కనీసం రెండు నెలలకి ఒకసారి నిర్వహించాలి. మహాసభ, కార్యవర్గ సమావేశాల సక్రమ నిర్వహణకుగాను వాటికి ముందు, వెనుక ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాలు విధిగా నిర్వహించాలి.
బి. నోటీస్‌లు: ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాలకు 7 రోజులు, కార్యవర్గ సమావేశాలకు 10 రోజుల ముందు, మహాసభలకు 15రోజుల ముందుగా సభ్యులకు నోటీస్‌లు పంపించాలి. అత్యవసర సందర్భాల్లో ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాలకి 3 రోజుల ముందు, కార్యవర్గ సమావేశాలకి 5 రోజుల ముందు సమాచారం తెలిపి సదరు సమావేశాలు ఏర్పాటు చేయాలి.
సి. కోరం : అన్ని స్థాయిల్లోని మహాసభ, విస్తృత కార్యవర్గం మరియు కార్యవర్గ సమావేశాలకు 1/3 వంతు, ఆఫీస్‌ బేరర్స్‌కు మెజార్టీ సభ్యుల హాజరు కోరంగా వుంటుంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ఆయా కమిటీల సభ్యులలో 3/4 వంతు కోరంగా ఉండాలి. కోరము లేనప్పుడు సమావేశములను వాయిదా వేయుటకు అధ్యక్షునికి అధికారము వుంటుంది. కోరం లేని సమావేశములలో తీసుకొన్న నిర్ణయములు చెల్లవు.
2. అవసరాన్ని బట్టి ప్రాంతీయ సమావేశాలు (కొన్ని జిల్లాలు, మండలాలు కలిపి) మరియు సందర్భాన్ని బట్టి ప్రత్యేక సమావేశాలు జరుపవచ్చును. రాష్ట్ర / జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌చే నియమించబడిన బాధ్యుడు ఈ సమావేశాలకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు.
3. మహాసభ తర్వాత మరో మహాసభ జరిగే మధ్య కాలంలో ఖాళీ అయ్యే ఆఫీస్‌ బేరర్‌లు, ఆడిట్‌ కమిటీ సభ్యుల స్థానాలను కార్యవర్గం ఎన్నిక ద్వారా భర్తీ చేస్తుంది.
4. క్రింది శాఖల ఆఫీస్‌ బేరర్స్‌, కార్యవర్గం తదితర సమావేశాలకు పై శాఖ బాధ్యులను విధిగా ఆహ్వానించాలి.
5. అభిప్రాయ సేకరణ : ఒక విషయమును అత్యవసరంగా నిర్ణయించవలసి వచ్చినప్పుడు కార్యవర్గ సభ్యుల, ఆఫీస్‌ బేరర్స్‌ అభిప్రాయాలను ఎస్‌ఎంఎస్‌ / ఇ-మెయిల్‌ / ఫోన్‌ ద్వారా తెలుసుకొని, మెజార్టీని బట్టి ఆ విషయమును అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిర్ణయించవచ్చును.
6. జిల్లా, ప్రాంతీయ శాఖల కార్యాలయ భవనాల నిర్మాణము విస్తరణ, లేక పునర్నిర్మాణం కొరకు రాష్ట్ర కార్యదర్శివర్గం అనుమతితో ఆయా శాఖలు స్థలము లేక ప్రస్తుత భవనములపై జాతీయ బ్యాంకు ద్వారా ఆయా పరిస్థితులను బట్టి వాటి స్థిరాస్థుల విలువ మేరకు అప్పు తీసుకొనవచ్చును. చేసిన అప్పులు తీర్చుకొనుటకు ఆయా శాఖలే బాధ్యత వహించును.
7. నిబంధనావళిపై సందేహాలుగానీ, వివాదాలుగానీ వచ్చినప్పుడు రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ చెప్పిన వ్యాఖ్యానమే తుదియైనది.
8. క్రింది శాఖల నుండి రిపోర్టులను ఎప్పటికప్పుడు పై శాఖలకు పంపిస్తుండాలి. పై శాఖలు అవసరమైన సమాచారమును క్రింది శాఖలకు పంపిస్తుండాలి. TSUTF బులెటిన్‌ను సర్క్యులర్‌ స్థాయిలోనే నడపాలి.
9. ఉద్యమ అవసరాల మేరకు రాష్ట్ర, జిల్లా కేంద్రములలో హోల్‌ టైమర్లను, ఆఫీస్‌ సిబ్బందిని నియమించుటకు వారి అలవెన్సులు నిర్ణయించుటకు, ఆఫీస్‌లకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకొనుటకు రాష్ట్ర, జిల్లా అఫీస్‌ బేరర్స్‌కి అధికారం ఉంటుంది.
10. వివిధ స్థాయిల్లో అవసరాన్ని బట్టి అకడమిక్‌, ప్రచురణలు, మహిళా విభాగం, సోషల్‌మీడియా, క్రీడా, సాంస్కృతిక కన్వీనర్లను సంబంధిత ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాలకు ఆహ్వానిస్తారు.

XIII మహాసభలు

1. ఎ) ఫెడరేషన్‌ మహాసభలు మండల స్థాయిలో ప్రతి సంవత్సరము విధిగా నిర్వహించాలి. జిల్లా, రాష్ట్ర మహాసభలు ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి విధిగా నిర్వహించాలి.
బి) నిర్ణీత కాలంలో నిర్మాణం జరగని మండల / పట్టణ శాఖలకు జిల్లా ఆఫీసు బేరర్లు అడ్‌హాక్‌ కమిటీని నియమించాలి. ఈ కమిటీ ఆ సంవత్సరము సభ్యత్వం చేర్పించి మండల మహాసభ నిర్వహించాలి.
సి) రాష్ట్ర సంఘం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం జిల్లా మహాసభ నిర్వహించని జిల్లాకు రాష్ట్ర ఆఫీసు బేరర్లు అడ్‌హాక్‌ కమిటీని నియమించాలి. అడ్‌హాక్‌ కమిటీ ఆధ్వర్యంలో తర్వాత సంవత్సరము మండల మహాసభలలో జిల్లా మహాసభ ప్రతినిధులను ఎన్ను కొంటారు. మండల మహాసభల అనంతరం జిల్లా మహాసభ నిర్వహించి కార్యవర్గము, ఆఫీసు బేరర్లు, ఆడిట్‌ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఇట్టి కమిటీల కాలము 1 సంవత్సరము వుంటుంది.
2. మహాసభలు జరుగు ప్రదేశాలలో ఆహ్వాన సంఘాలను స్థానిక పెద్దలచే ఏర్పాటు చేయాలి. ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శిగా ఆయా శాఖల ఆఫీస్‌బేరర్స్‌లో ఒకరు ఉండాలి.
3. ఆహ్వాన సంఘం విరాళాలను సేకరించి సభలను జయప్రదంగా జరుపుటకు అన్ని విధాల తోడ్పతుంది. ఆహ్వాన సంఘం మహాసభ పూర్తి అయిన నెల రోజుల్లో మహాసభ అకౌంట్సును తేల్చి మిగిలిన పైకమును సంబంధిత శాఖలకు అప్పగించాలి. తదుపరి ఆహ్వాన సంఘం రద్దగును.
ఎ) అన్ని శాఖల మహాసభలకు అవసరాన్ని బట్టి ప్రతినిధి రుసుము ఆ శాఖల ఆఫీస్‌ బేరర్స్‌ నిర్ణయిస్తారు.
బి) మహాసభలలో ఆయా స్థాయి కార్యవర్గములు ప్రవేశపెట్టిన నివేదికలు, జమాఖర్చులు, తీర్మానములను చర్చించి ఆమోదము పొందాలి. అట్లు ఆమోదం పొందని నిర్ణయాలు, ఖర్చులు చెల్లవు.
సి) కార్యవర్గం నిర్ణయం మేరకు సోదర ప్రజా సంఘాల, ఇతర రాష్ట్రాల, ఎస్‌టిఎఫ్‌ఐ అనుబంధ సంఘాల ప్రతినిధులను సౌహార్థ ప్రతినిధులుగా అనుమతిస్తారు.
డి) అన్ని స్థాయిలలో మహాసభలకు ఉద్యమ అవసరాన్ని బట్టి పదిమందికి మించకుండా పరిశీలకులను సంబంధిత ఆఫీస్‌ బేరర్స్‌ నిర్ణయిస్తారు.
4. విస్తృత కార్యవర్గ సమావేశం :- ఎ) మహాసభలు జరగని సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో విస్తృత కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాలకు ఆయా శాఖల కార్యవర్గసభ్యులు మరియు క్రింది శాఖల ప్రధాన ఆఫీస్‌ బేరర్స్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ / ఆడిటర్‌ మరియు మహిళా కార్యదర్శులు ప్రతినిధులుగా ఉంటారు.
బి) జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం నవంబర్‌ 30లోపు, రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం డిసెంబర్‌ 31లోపు నిర్వహించాలి.
సి) ఈ సమావేశంలో మహాసభల అనంతరం విస్తృత సమావేశం నాటివరకూ జరిగిన కార్యకలాపాలు, మహాసభల కర్తవ్యాల అమలు, ఆర్థిక నివేదికల పై చర్చించి ఆమోదం తీసుకోవాలి. వీటిని అంతిమంగా మహాసభ ఆమోదించాల్సి వుంటుంది.

XIV విద్యావిషయక (అకడమిక్‌) విభాగము

1. విద్యావిషయక పత్రములు, ప్రతిపాదనలు, సెమినార్లు, ప్రణాళికలు రూపొందిస్తుంది.
2. ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యం పెంపొందించుటకు సాహిత్యం, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది.
3. ప్రభుత్వం ప్రకటించే కరిక్యులమ్‌, సిలబస్‌ పాఠ్యగ్రంథాలను పరిశీలించి అవసరమైన ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు చేస్తుంది.

XV ప్రచురణల విభాగము

ప్రతి సంవత్సరం యుటియఫ్‌ డైరీ, ప్రభుత్వ ఉత్తర్వుల సంపుటాలు, వృత్తికి సంబంధించిన, విద్యా విషయక పుస్తకములు ప్రచురిస్తుంది.

XVI మహిళా విభాగము

1. మహిళా ఉపాధ్యాయుల ప్రత్యేక సమస్యలపై అధ్యయనం చేస్తుంది. అవసరమైన సందర్భాలలో ఆయా స్థాయిలలో అధికారులకు ప్రాతినిధ్యం చేస్తుంది.
2. ప్రత్యేకంగా క్లాసులు, గోష్టులు, సమావేశాలు నిర్వహించడం ద్వారా మహిళా ఉపాధ్యాయులలో చైతన్యం కలిగించి నాయకత్వ స్థాయి అభివృద్ధికి కృషి చేస్తుంది.

XVII సాంస్కృతిక విభాగముv

1. ఉపాధ్యాయులలో సాంస్కృతిక నైపుణ్యాలను గుర్తించి ప్రజా కళలు, ప్రత్యామ్నాయ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తుంది.
2. సభలు, సమావేశాల సందర్భంలో సాంస్కృతిక ప్రదర్శనలు యివ్వటానికి కృషి చేస్తుంది.

XVIII క్రీడా విభాగము

1. ఉపాధ్యాయుల్లో క్రీడలు, వ్యాయామ విద్యను ప్రోత్సహించటానికి కృషి చేస్తుంది.
2. ప్రభుత్వం ప్రకటించే క్రీడల విధానం, అమలు చేసే తీరు తెన్నులను పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు చేస్తుంది.
3. పాఠశాలలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తుంది.

XIX సోషల్‌మీడియా విభాగము

1. ప్రభుత్వ విద్య అభివృద్ధి శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు సోషల్‌ మీడియా ద్వారా కృషి చేస్తుంది.
2. సంఘ కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ఉపాధ్యాయులకు చేరవేస్తుంది.
3. సంఘ అధికారిక వెబ్‌సైట్ల నిర్వహణకు సహకరిస్తుంది.

XX విద్యావిషయక (అకడమిక్‌), ప్రచురణలు, మహిళ, సాంస్కృతిక, సోషల్‌మీడియా మరియు క్రీడా విభాగముల పనిని రూపొందించి అమలు చేయటానికి ఆఫీస్‌ బేరర్లు బాధ్యత వహిస్తారు.

తెలంగాణ రాష్ట్ర
ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌
విధాన పత్రం
సమాజంలో ఉపాధ్యాయులకు విశిష్టమైన స్థానం వున్నది. మధ్య తరగతి వర్గంలో విద్యాధికులుగా వుండి సమాజ పరిణామాలను అర్థం చేసుకొని స్పందించగలరు. సమాజ నిర్మాణంలో అభ్యుదయకరంగా వుండే నూతన తరమైన విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు వున్నది. పట్టణాలు, పల్లెలు ప్రతి జనావాసంలోనూ వుంటూ ప్రజలకు దగ్గరగా వుంటారు. పాలకవర్గాల విధానాలు, పథకాల ప్రభావానికి గురవుతూ వుంటారు. ఈ విషయాలను అధ్యయనం చేయగలిగే ఉపాధ్యాయులే సమాజం పట్ల తమ గురుతర బాధ్యతను గుర్తించగలరు.
భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ అన్ని విషయాల్లోనూ సమాన అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కానీ అనుభవంలో అనేక అసమానతలు కొనసాగుతున్నాయి. పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల వలన సకల సౌకర్యాలు కొంతమందికే పరిమితమై, కోట్లాది మంది ప్రజలకు కనీస అవసరాలు కూడ తీరటం లేదు. ఈ పరిస్థితిలో మార్పురావాలని యుటియఫ్‌ కోరుతుంది. ఉపాధ్యాయుల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, నైతిక, పౌరహక్కుల కోసం, వాక్‌సభా పత్రికా సమావేశ స్వాతంత్య్రాల కోసం, కులమత జాతి ప్రాంత స్త్రీ పురుష విభేదాలతో నిమిత్తం లేకుండా కృషి చేస్తుంది. సమాజ శ్రేయస్సుతోనే ఉపాధ్యాయుల సంక్షేమం ముడిపడి వున్నదనే అవగాహనతో సమాజ వికాసానికి దోహదపడే ఉద్యమాలను ప్రోత్సహిస్తుంది. వాటిలో ఉపాధ్యాయులు పాల్గొనేందుకు కృషి చేస్తుంది.
7 దశాబ్దాల స్వరాజ్య పరిపాలనలో విద్యావైజ్ఞానిక రంగాల్లో ఆశించిన అభివృద్ధి సాధించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న సరళీకృత విధానాల ఫలితంగా సాధించిన ప్రగతికీ ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. విదేశీ పెట్టుబడులు, సరుకులు, సర్వీస్‌ల ప్రవాహంలో స్వదేశీ పరిశ్రమలు, వ్యవసాయం, విద్యారంగం అన్నీ కొట్టుకు పోతున్నాయి. ప్రజలు ఆకలితో అల్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ బిడ్డల్ని చదివించుకొనే పరిస్థితి కూడా లేదు. విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగిపోయింది. ప్రభుత్వ విద్యారంగం నిరాదరణకు గురవుతున్నది. సంక్షేమ రాజ్యం సంక్షోభంలో కూరుకు పోతున్నది.
దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యకి ప్రాధాన్యత యివ్వాలని, 14 సంవత్సరాలలోపు బాలబాలికలు అందరినీ 1960 నాటికే పాఠశాలల్లో చేర్చాలని ఆదేశిక సూత్రాల్లో చెప్పటం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6-14 సంవత్సరాల బాలలకు విద్యని ప్రాథమిక హక్కుగా గుర్తించి, 2009 ఆగస్టులో 35/2009 విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. 2010 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుండి చట్టం అమలులోకి వచ్చింది. నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ దేశవ్యాప్తంగా కోటికిపైగా బడిఈడు పిల్లలు బడిబయట వున్నారు. బడిలో చేరినవారిలో 25 శాతంపైగా పాఠశాల విద్య పూర్తి చేయకుండానే డ్రాపౌట్‌గా మారుతున్నారు. బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్చుటకుగాని, బడిలో చేరిన విద్యార్థులందరు పాఠశాల విద్య పూర్తగునట్లుగా గాని, అవసరమైన చర్యలు లేవు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో ప్రైవేటీకరణ పెరిగిపోతున్నది. ఇంక మన రాష్ట్రంలో అత్యధికంగా ప్రైవేటీకరణ జరిగింది.
క్రొత్త రాష్ట్రంలో క్రొత్త ప్రభుత్వం మాత్రం పాఠశాల విద్య ప్రభుత్వరంగంలోనే వుంటుందని ప్రకటించింది. ఈ ప్రకటనను స్వాగతిస్తున్నాం. అందుకనుగుణంగా చర్యలు ప్రారంభించాలి. అమలు చేసే క్రమంలో వచ్చే ఆటంకాలను అధిగమించుటకు అవసరమైన సహకారాన్ని అందిస్తాము. ప్రభుత్వ పాఠశాలల్లో కూడ ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టవలసిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వము కూడ అందుకను కూలంగా వున్నందున, మండలానికి 10 ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు సమాంతరంగా ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలి. సక్సెస్‌ హైస్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియం తరగతుల బోధనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తద్వారా పాఠశాల విద్యారంగంలోని అసమానతలను తొలగించుటకు కృషి సల్పాలి. పాఠశాల విద్యలో అమలు జరిగే కేంద్ర ప్రాయోజిత పథకాలు (ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ) సింగిల్‌ విండో పద్ధతిలో విద్యాశాఖ ద్వారా మాత్రమే అమలు చేయాలి. ఈ పథకాల అమలుకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ కార్యాలయాలు, అధికారులు అవసరం లేదు. విద్యాహక్కు చట్టం పటిష్టంగా అమలు చేయుటకు అధిక నిధులను కేంద్ర ప్రభుత్వము విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలుచేసి, బడిఈడు పిల్లలందరికి పాఠశాల విద్య అందించాలి.
ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ ఉద్యమం చాలా కీలకమైన కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ అభిప్రాయపడుతున్నది. సమాజ అభివృద్ధికి, విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయ సంక్షేమానికి ఆటంకంగా వున్న అన్ని రకాల విధానాలపైన ఉపాధ్యాయులను చైతన్య పరిచి, సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తుంది. అందుకు క్రింది విధంగా తన విధి విధానాలను రూపొందించు కుంటున్నది.
1. పాఠశాల విద్యారంగంలో తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ అగ్రగామి సంస్థగా వున్నది. ఈ రంగంలో మరికొన్ని సంఘాలు కూడా పనిచేస్తున్నాయి. విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి స్వతంత్ర కార్యాచరణలతో పాటు ఐక్య ఉద్యమాలు నిర్మించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుంది. ఉపాధ్యాయుల న్యాయసమ్మతమైన తాత్కాలిక కోర్కెలు, విద్యా విధానంలో మార్పు, చేర్పుల కోసం కృషి చేస్తుంది.
2. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గిరిజన సంక్షేమ మరియు ఎయిడెడ్‌ తదితర మేనేజిమెంట్లలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తూ, ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. పాఠశాలలన్నీ ఒకే గొడుగు క్రిందకు, చట్టబద్ధమైన విద్యాబోర్డ్‌ల నిర్వహణలోకి తీసుకురావటానికి కృషి చేస్తుంది.
3. కుల, మత, ప్రాంతీయ, భాషా తత్వాలతో నిమిత్తం లేకుండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వ్యవహరిస్తుంది. ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలకు సంబంధించినంత వరకు ఏ ఉపాధ్యాయులు, ఏ సంఘంలో, ఎవరి నాయకత్వాన వున్నారన్న దానితో నిమిత్తం లేకుండా బలపరుస్తుంది. ఆ విధంగా ఉపాధ్యాయులందరి న్యాయమైన కోర్కెలను తమ కోర్కెలుగానే పరిగణించి సమర్థిస్తుంది. మేధావులయిన ఉపాధ్యాయులు కుల మతాలకు అతీతంగా వుండి దేశ సమగ్రతకు కృషి చేయాలని యుటియఫ్‌ కోరుకుంటుంది.
4. పీడిత ప్రజల హక్కులను, పోరాటాలను ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ బలపరుస్తుంది. మధ్య తరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలసికట్టుగా వ్యవహరించాలని అకాంక్షిస్తుంది.
5. విద్యార్థుల, ఉపాధ్యాయుల ఐకమత్యాన్ని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వాంఛిస్తుంది. అందుకని అభ్యుదయకర విద్యార్థి ఉద్యమాలతో కలిసి మెలసి వ్యవహరించడానికి కృషి చేస్తుంది.
6. అన్ని అభ్యుదయ ప్రజాస్వామిక సంఘాలతోనూ, ఉద్యమాలతోనూ, శక్తులతోనూ సహకరించాలని, ఆయా శక్తుల సహకారం పొందాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కోరుకుంటుంది.
7. ఇతర రాష్ట్రాలలో గల ఉపాధ్యాయ ఉద్యమాలతోను, దేశ వ్యాపిత ఉపాధ్యాయ ఉద్యమాలతోనూ, పరస్పర సన్నిహిత సంబంధాలు కలిగి వుండటానికి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కృషి చేస్తుంది. ప్రపంచ ఉపాధ్యాయ ఉద్యమాలతో సత్సబంధాలు కలిగి వుండడానికి కృషి సల్పుతుంది.
8. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఒక ప్రజా సంస్థ. ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. సంఘ ఆశయాలను, నిబంధనావళిని ఆమోదించిన ఉపాధ్యాయులు విభిన్న రాజకీయ దృక్పథాలు కలవారే అయినా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సభ్యులుగా వుండవచ్చును. మెజార్టీ తన రాజకీయ అభిప్రాయాన్ని మైనార్టీపైగాని, భిన్నాభిప్రాయం గల వ్యక్తులపైగాని రుద్ధడానికి అవకాశం వుండదు. అన్ని ఎన్నికలలోనూ ఎవరి అభీష్టాన్ని అనుసరించి వారు ఓటు చేసుకొనే స్వేచ్ఛ వుంటుంది.
9. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ముఠా తత్వాలను సహించదు. అదే సమయంలో నిరంకుశ నిర్మాణ పద్ధతులు ఉద్యమాభివృద్ధికి దోహదం చేయవని కూడా అది గుర్తిస్తుంది. కనుక విభిన్న రాజకీయాభిప్రాయాలు కలిగిన వారైనా ఉపాధ్యాయ ఉద్యమంలోనూ, ముఖ్యంగా ఈ సంస్థలోనూ సమైక్యంగా దోహదం చేసే నిర్మాణ పద్ధతులనే అమలు జరుపుతుంది. సంప్రదింపుల ద్వారా సమైక్య నాయకత్వం కోసమే కృషి సల్పాలన్నది ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆశయంగా ఉంటుంది.
10. దీర్ఘకాలంగా సమాజంలో సాగిన అసంబద్ధాల కారణంగా కొందరు ఏ హక్కులు లేకుండా అణచబడి వున్నారు. అట్టి హరిజన, గిరిజన, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్‌లు, మరికొన్ని రాయితీలు కల్పించాలని యుటియఫ్‌ కోరుకుంటుంది. అయితే సమస్యకు అదే శాశ్వత పరిష్కారం కాదని సమాజం సమూలంగా మారినప్పుడే అవి పూర్తిగా పరిష్కరంచబడతాయని యుటియఫ్‌ అభిప్రాయపడుతుంది.
11. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని యుటియఫ్‌ కోరుకుంటున్నది. అందుకు ప్రపంచ శాంతి వర్థిల్లాలని ఆశిస్తుంది. అందుకు కృషి చేస్తుంది. అందుకు భిన్నంగా పనిచేసే శక్తులను యుటియఫ్‌ వ్యతిరేకిస్తుంది.
12. ప్రకృతిలో సమతుల్యం లోపించి, జీవుల మనుగడే ప్రమాదంలో పడింది. పరిశ్రమలు, వాహనాలు ఇతరాల కారణంగా అన్నీ కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వము, ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని యుటియఫ్‌ కోరుతున్నది.
నిరంతరం కొనసాగించిన ఆందోళన ద్వారానే ఉపాధ్యాయుల హక్కులు అభ్యుదయకర సంస్కరణలు సాధ్యమవుతాయనీ, అంతిమ ఆశయాన్ని సదా గుర్తుంచుకున్న ఉద్యమమే అటువంటి మెళకువతో ఉద్యమాన్ని నిర్మించి విజయాలను సాధించగలు గుతుందనీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నమ్ముతుంది.
×××