ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి

– మ్యూచువల్‌ బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలి
– కొత్త లోకల్‌ క్యాడర్లలో స్పౌజ్‌ బదిలీలు,ఇతర అప్పీళ్లనుపరిష్కరించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

              ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ను ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. మ్యూచువల్‌ బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలనీ, కొత్త లోకల్‌ క్యాడర్లలో స్పౌజ్‌ బదిలీలు, ఇతర అప్పీళ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల సక్రమ నిర్వహణకు ఉపాధ్యాయులు, అందులోనూ సబ్జెక్టు టీచర్లు ఉండి తీరాలన్నారు. భౌతిక నమూనా కూడా ముఖ్యమే అని అభిప్రాయపడ్డారు. వీటన్నింటిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తే పిల్లలకు మంచి చదువును అందించగలుగుతామని తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వీటిలో ప్రధానోపాధ్యాయుల పోస్టులను 100 శాతం, స్కూలు అసిస్టెంటు పోస్టులను 70 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టులు 3,934కు గాను 1,745 పోస్టులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు 445కు గాను 211 పోస్టులు, స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు 8,000 ఖాళీగా ఉన్నాయని చెప్పారు. జూన్‌ లో బడులు ప్రారంభమయ్యే నాటికి పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తామని ఏప్రిల్‌ 21న ఉపాధ్యాయ ఎమ్మెల్సీల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. చేసేది సమయానికి చేస్తే ఉపయోగముంటుందని హితవు పలికారు. వేసవికాలం సెలవులు ఇప్పటికే సగం అయిపోయాయనీ ఇంకా షెడ్యూల్‌ రాకపోవటంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నదని తెలిపారు.

మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంతో పాటు ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తున్నందున చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అలుగుబెల్లి తెలిపారు. అయితే ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులతో నిండి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ, మోడల్‌, కేజీబీవీ పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులకు కుటుంబ అవసరాల రీత్యా బదిలీ అవసరమందనీ, ఇలాంటి వారికి ఆన్‌ లైన్‌ పద్ధతిలో పారదర్శకంగా బదిలీలకు అవకాశమివ్వొచ్చని తెలిపారు.
               పీఇటీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు అప్‌గ్రేడ్‌ చేసి ఐదేండ్లు గడుస్తున్నదనీ, పండిత్‌ లను పీఇటీల పదోన్నతులు అలాగే నిలిచిపోయాయని నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 33 జిల్లాల్లో 21 జిల్లాలలకు డిఇఓ పోస్టులు మంజూరు చేయలేదనీ, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ లేదా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ క్యాడర్‌ వారే జిల్లా విద్యాశాఖాధికారులుగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) కొనసాగుతున్నారని చెప్పారు. 10 డైట్‌ కళాశాల్లో 286 టీచింగ్‌ పోస్టులకు గాను 265, బిఇడి కళాశాలలు, ఎస్‌సీఇఆర్టీలో 138 టీచింగ్‌ పోస్టులకుగాను 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2018 కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినందున పదోన్నతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన సూచించారు.

సీఎస్‌ స్పష్టతనివ్వాలి…..

మ్యూచువల్‌ బదిలీలపై హైకోర్టు అభిప్రాయాన్ని వెల్లడించిందనీ, కేసు జూన్‌కు వాయిదా పడిందని అలుగుబెల్లి తెలిపారు. ఈ విషయం తమకు తెలియదంటూ విద్యాశాఖాధికారులు చెబుతున్నారనీ, మ్యూచువల్‌ బదిలీలపై సీఎస్‌ స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. నూతన లోకల్‌ క్యాడర్ల ప్రకారం…13 జిల్లాల్లో భార్యభర్తల బదిలీలు పూర్తిగా నిలిచిపోయాయి. మిగిలిన జిల్లాల్లో కొన్ని మిగిలిపోయాయనీ, ఇతర అప్పీళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని పరిష్కరించాలని సీఎస్‌ను కోరారు.

గుడ్డు రేటును పెంచాలి

     పాఠశాలల్లో విద్యార్థులకందించే గుడ్డుకు ఇచ్చే రేటును రూ.5.50కు పెంచాలని అలుగుబెల్లి డిమాండ్‌ చేశారు. తక్కువ రేటు ఇస్తుండటంతో విద్యార్థులకు సరిపడిన గుడ్లను పెట్టడం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పారితోషికం రూ.3,000 ఇవ్వాలనీ, ప్రతి బడికి ప్రత్యేక స్వచ్ఛ కార్మికున్ని నియమించాలని కోరారు.

నిర్మాణాత్మక ప్రయత్నం జరగాలి

            విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణాత్మక ప్రయత్నం చేయాలని అలుగుబెల్లి డిమాండ్‌ చేశారు. విద్యారంగం గురించి ఆ రెండు ప్రభుత్వాలు చేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలతో ప్రజలకు ఒరిగేది ఏమి లేదని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షలో భాగంగా బడుల నిర్వహణ గ్రాంటును పెంచాలనీ, దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న గ్రాంట్‌ కొన్ని స్కూళ్లలో కరెంట్‌ బిల్లు కట్టేందుకు కూడా సరిపోవడం లేదని తెలిపారు. విద్యారంగాన్ని బాగు చేసేందుకు మరో ఉద్యమం అవసరమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.