ఒక్కరికోసం అందరం – అందరికోసం ప్రతిఒక్కరం. 

ఉపాధ్యాయ కుటుంబాల సంక్షేమం కోసం

TSUTF కుటుంబ సంక్షేమ నిధి లో సభ్యులుగా చేరండి.

మిత్రులారా !

మన సంఘం TSUTF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ” TSUTF కుటుంబ సంక్షేమ నిధి” ఏర్పాటు చేస్తున్నాము. ఉపాధ్యాయుల మధ్య ఐకమత్యం, పరస్పర సహకారం, సంఘీభావం పెంపొందించుటకు, మరణించిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవటానికి TSUTF ఈ వినూత్న పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది.

 

2004 సెప్టెంబర్ తర్వాత నియామకం అయిన ఉపాధ్యాయులకు ప్రభుత్వ పెన్షన్ లేదు. రిటైర్ అయిన తర్వాత వచ్చే సొమ్ము ఎంతో తెలియదు కానీ హఠాత్తుగా చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలు మాత్రం సామాజిక భద్రత కరువై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. మోడల్ స్కూల్స్, కెజిబివి ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు కూడా లేక పోవటంతో వారి కుటుంబాల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది.

 

గత సంవత్సరం అక్టోబర్ లో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బందెప్ప, దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు కామ్రేడ్ నాన్యానాయక్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారం రోజుల్లో రు. 20,50,000 లు విరాళాలు అందజేసి సంఘీభావం ప్రకటించారు. కోవిడ్ తో మరణించిన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల ఉపాధ్యాయుడు కామ్రేడ్ సీత జంగయ్య కుటుంబానికి ఆ మండల శాఖ పిలుపు మేరకు పలువురు కార్యకర్తలు స్పందించి రు. 3,25,000 లు విరాళం అందజేశారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ టీచర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయి పిల్లలిద్దరూ అనాథలైన సందర్భంలో పాఠశాల ఉపాధ్యాయుల పిలుపు మేరకు సంఘాలకతీతంగా దాతలు స్పందించి రు. 19,00,000లు సహాయం చేశారు. ఇంకా వివిధ కారణాలతో అర్థాంతరంగా చనిపోయిన ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితిని బట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఉపాధ్యాయుల బంధువులో, సహెూపాధ్యాయులో లేదా మండల శాఖలో చొరవ తీసుకుని ఆర్థిక సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కొందరు ఉపాధ్యాయులు, TSUTF కార్యకర్తలు మానవత్వంతో స్పందించి తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. అలా అక్కడొకరికి ఇక్కడొకరికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్ యుటిఎఫ్ సభ్యులు ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో మన సంఘం ఆధ్వర్యంలోనే “TSUTF కుటుంబ సంక్షేమ నిధి” పథకాన్ని ఏర్పాటు చేస్తున్నాము

.

TSUTF కుటుంబ సంక్షేమ నిధి పథకం 2023 మే 2న నల్లగొండలో లాంఛనంగా ప్రారంభించబడుతుంది. 2023 జులై 1 నుండి అమలులోకి వస్తుంది. FWF నూతన కమిటీ ఎన్నికయ్యేవరకు TSUTF రాష్ట్ర కమిటీ FWF కార్యవర్గంగానూ ఆఫీస్ బేరర్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా తాత్కాలికంగా వ్యవహరిస్తారు.

 

2023 ఏప్రిల్ 9న జరిగిన TSUTF రాష్ట్ర కమిటీ సమావేశంలో కుటుంబ సంక్షేమనిధి చైర్మన్ గా చావ రవి, వైస్ చైర్మన్ కె. జంగయ్య, కార్యదర్శిగా యం. రాజశేఖర్రెడ్డి, సహాయకార్యదర్శిగా టి. లక్ష్మారెడ్డి, కోశాధికారిగా జి. నాగమణి ఎన్నికయ్యారు.

 

TSUTF సభ్యులు అందరూ FWF పథకంలో సభ్యులుగా చేరి “ఒకరి కోసం అందరం – అందరికోసం ప్రతి ఒక్కరం” అనే ఉన్నతాశయంతో TSUTF కుటుంబాలకు అండగా నిలబడదాం. మనమిచ్చే చిన్న మొత్తం మనకు భారం కాదు…. కానీ ఆపత్కాలంలో మనమందరం ఇచ్చే విరాళం ఆ కుటుంబానికి కొండంత ఆసరాగా ఉంటుంది.

పథకం నియమాలు:

 1. TSUTF సభ్యులుగా ఉండి, ప్రభుత్వ, ప్రభుత్వ ద్రవ్య సహాయంతో నిర్వహింపబడుతున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న (సర్వీసులో ఉన్న) రెగ్యులర్ మరియు ఫుల్ టైం కాంట్రాక్టు ఉపాధ్యాయులు FWF పథకంలో సభ్యులుగాచేరవచ్చు. 
 2. FWF పథకంలో చేరేవారు తప్పనిసరిగా ‘‘వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్‘‘ మాసపత్రిక చందాదారులై ఉండాలి. చందాదారులు కానట్లయితే రు 200లు చెల్లించి చందాదారులుగా కావాలి.
 3. FWF పథకంలో చేరినప్పుడు సభ్యత్వం రు 200, కాషన్ డిపాజిట్(రిఫండబుల్) రు 1000 చెల్లించాలి.
 4. కాషన్ డిపాజిట్ రిటైర్ అయినప్పుడు లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు సాధారణ SB వడ్డీతో తిరిగి చెల్లించబడుతుంది. 
 5. సభ్యత్వం రు 200 పథకం నిర్వహణకోసం వినియోగించుకోబడుతుంది.
 6. చనిపోయిన FWF సభ్యుని నామినీకి పదిహేను రోజుల్లోగా ఆనాటికి పథకంలో ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం సభ్యునికి రు. 100 చొప్పున లెక్కించి రిజర్వు ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.
 7. ఆ మొత్తాన్ని పథకంలోని సభ్యులు ఒక్కొక్కరినుండి రు 100 చొప్పున వసూలు చేసి రిజర్వుఫండ్ కు జమ చేస్తారు. 
 8. FWF సభ్యులు చనిపోయిన సందర్భంలో రు. 100 చొప్పున మిగిలిన సభ్యులందరూ సంఘీభావ విరాళాన్ని చెల్లించాలి. 
 9. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరులోగా రు 30 చెల్లించి FWF సభ్యత్వం రెన్యువల్ చేయించుకోవాలి. వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ చందా కలిగి, సంఘీభావవిరాళం బకాయిలు పూర్తిగా చెల్లించిన వారి సభ్యత్వం మాత్రమే రెన్యువల్ చేయబడుతుంది. రెన్యువల్ కాని వారు సభ్యత్వం కోల్పోతారు.
 10. FWF పథకం నిర్వహణ కోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహణా కమిటీ(బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్), కార్యవర్గం, జనరల్ కౌన్సిల్ అనే మూడు దొంతరల పాలకవర్గం ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా ఆఫీసు బేరర్స్ లో ఒకరు కన్వీనర్ గా, మండల కన్వీనర్లు సభ్యులుగా జిల్లా FWF సబ్ కమిటీ ఉంటుంది. మండల ఆఫీసు బేరర్స్ లో ఒకరు FWF మండల కన్వీనర్ గా ఉంటారు.
 11. FWF పథకం పూర్తిగా TSUTF రాష్ట్ర కమిటీ నియంత్రణలో నల్లగొండ జిల్లా కార్యాలయం నుండి నిర్వహింపబడుతుంది. 
 12. FWF సభ్యత్వం, రెన్యువల్, సంఘీభావ విరాళం రిసిస్ట్స్ & పేమెంట్స్ అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. 
 13. FWF పథకంలో సభ్యులను చేర్పించటం, చనిపోయిన సభ్యులను గుర్తించటం, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించటం, సభ్యులనుండి కంట్రిబ్యూషన్ వసూలు చేయటం వంటి పనులన్నీ TSUTF జిల్లా, మండల ఆఫీసు బేరర్ల సహకారంతోనే నిర్వహించబడతాయి.
 14. FWFవ్యాపార సంస్థ కాదు. TSUTF సభ్యుల కుటుంబ సంక్షేమం కోసం మాత్రమే ఉద్దేశించినది.
 15. FWFనియమావళిని చదివి, ఆమోదించినవారు మాత్రమే FWF పథకంలో సభ్యులుగా చేరాలి. 
 16. FWF దరఖాస్తు పూర్తి చేసి, TSUTF మండల, జిల్లా శాఖల ద్వారా FWF రాష్ట్ర కేంద్రానికి పంపాలి.

 

ఉద్యమాభివందనములతో….

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, రాష్ట్ర కమిటీ